31, అక్టోబర్ 2012, బుధవారం

సంతాన రాహిత్యం  అవగాహన   santhaana rahityam

 
(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS.శ్రీకాకుళం )

Saturday, June 16, 2012

సంతాన రాహిత్యం-అవగాహన , Infertility-Awareness

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సంతాన రాహిత్యం-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సంతానం సహజం! ప్రతి జంటా పండంటి బిడ్డల గురించి కలలు కనటం సహజం!! కానీ పిల్లలు పుట్టటమన్నది అందరికీ అంతే సహజంగా, అంత తేలికగా జరగకపోవచ్చు. స్త్రీపురుషులలో ఎన్నో హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తేనేగానీ గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఆచితూచి లెక్కించినట్లు ప్రతి రుతుచక్రంలో.. కాలక్రమం ప్రకారం నడిచిపోతుండే ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారం ఉంది. అందుకే సంతానం ఎంత సహజమో... మన సమాజంలో సంతాన రాహిత్యం కూడా అంతే సర్వసాధారణంగా కనబడుతుంటుంది. కానీ ఒకప్పటి కంటే సంతాన రాహిత్యం విషయంలో మన అవగాహన నేడు ఎంతో పెరిగింది. పండంటి బిడ్డల కల నెరవేర్చేందుకు ఆధునిక వైద్యరంగం ఇప్పుడు అద్భుతాలను తలపించే ఎన్నో సమర్థమైన చికిత్సలను ఆవిష్కరిస్తోంది. ఎంతోమందికి పిల్లలను అందిస్తోంది. అందుకే సంతాన రాహిత్యం, దాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్సల వివరాలు

ప్రపంచంలో 'ఐవీఎఫ్‌' వంటి అద్భుతమైన సంతాన సాఫల్య చికిత్సా విధానాల ద్వారా తొలి బిడ్డ పుట్టి దాదాపు 35 సంవత్సరాలు కావొస్తోంది. ఈ మూడున్నర దశాబ్దాల్లో ఈ విధానాల ద్వారా ఎంతలేదన్నా 50 లక్షలకు పైగానే బిడ్డలు పుట్టి ఉంటారని అంచనా. సంతాన రాహిత్యాన్ని అధిగమించి పండంటి బిడ్డలను పొందేందుకు లక్షలాది జంటలకు ఈ చికిత్సలు అక్కరకొస్తున్నాయి. మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ చికిత్సలకు విస్తృతమైన ఆదరణ లభిస్తోంది. అయినా ఇప్పటికీ మన సమాజంలో సంతాన రాహిత్యం గురించీ, సంతాన సాఫల్య చికిత్సల గురించీ పూర్తి బహిరంగంగా, అరమరికలు లేకుండా చర్చించే వాతావరణం లేదనే చెప్పాలి. నిజానికి సంతాన రాహిత్యమన్నది బయటికి కనబడకుండానే దంపతుల జీవితాలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసే ఓ అతి ముఖ్యమైన సమస్య. కొంగుముడి వేసుకున్న నాటి నుంచి పసిపిల్లల గురించి కలలుగనే జంటలకు సంతాన రాహిత్యం మిగిల్చే అసంతృప్తీ, ఆవేదనా అనంతం. సామాజికంగా నగుబాటుకు గురవుతూ, క్రమేపీ ఒంటరితనం, కుంగుబాటుల్లోకి జారిపోతూ వారు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తుంటారు. ఒక రకంగా ఇతరత్రా చాలా రకాల ఆరోగ్య సమస్యల కంటే ఎక్కువగా కలతకు గురి చేసే సమస్య- ఈ సంతానలేమి! అయితే ఈ సంతానం లేకపోవటమన్నది కూడా ఇతరత్రా ఆరోగ్య సమస్యల్లాంటిదేననీ, నేటి ఆధునిక వైద్య రంగం దీనికీ ఎన్నో సమర్థమైన చికిత్సా విధానాలను అందిస్తోందని అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం.

అరుదేం కాదు.. పైగా పెరుగుతోంది!
చాలామంది సంతానం కలగటం చాలా సహజమనీ, పిల్లలు కలగకపోవటమన్నది ఎక్కడో నూటికో కోటికో ఒకరికి మాత్రమే ఎదురయ్యే సమస్యని భావిస్తుంటారుగానీ ఇది పూర్తి నిజం కాదు. సంతాన రాహిత్యం కూడా ఎంతోమందిలో కనబడుతున్న సమస్యే. ప్రతి ఆరు జంటల్లో ఒకరికైనా ఇటువంటి సమస్య ఎదురవుతోందని అధ్యయనాల్లో గుర్తించారు. పైగా ఈ సమస్య రానురాను ఇంకా పెరుగుతోంది. పాశ్యాత్య దేశాల్లో మాదిరిగానే మన పట్టణాల్లో కూడా ప్రధానంగా జీవనశైలి మారిపోతుండటం, లేటు వయసులో వివాహాలు-గర్భధారణలు.. ఇవన్నీ సంతాన రాహిత్యాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయుల సంఖ్య పెరుగుతుండటం కూడా దీనికి మరో కారణం. ఊబకాయం వల్ల ఒంట్లో హార్మోన్లు అస్తవ్యస్తమై, అండాల విడుదలను ప్రభావితం చేస్తాయి. దీంతో సంతానావకాశాలు సన్నగిల్లుతాయి.

ఏడాది దాటితే.. అనుమానించాలి
భార్యాభర్తలు ఇతరత్రా సంతాన నిరోధక పద్ధతులేవీ పాటించకుండా.. ఏడాది పాటు ప్రయత్నించినా కూడా గర్భం రాకపోతే అప్పుడు సంతాన సమస్యలేమైనా ఉన్నాయా? అన్నది అనుమానించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఇలా ప్రయత్నిస్తే మొదటి ఏడాదిలోపే 85% మందిలో గర్భం వస్తుంది. మరో 5-7% మందిలో రెండో సంవత్సరంలోనూ జరగొచ్చు. కాబట్టి ఏడాది దాటినా ఫలితం లేదంటే వైద్యపరమైన సలహా తీసుకోవటం మంచిది. అయితే స్త్రీ వయసు మరీ ఎక్కువగా ఉన్నా, లేక నెలసరి సక్రమంగా రాకపోవటం వంటి ఇతరత్రా రుతుక్రమ సమస్యలేమైనా ఉన్నా మరికాస్త ముందుగానే వైద్యులను సంప్రదించటం ఉత్తమం.

ఏమిటి మార్గం?
సంతానం కలగటంలో ఇబ్బంది ఉందని గుర్తించినప్పుడు దంపతులు ఇరువురికీ కొన్ని పరీక్షలు చేయటం అవసరం. పురుషుల్లో వీర్య పరీక్ష చేస్తారు. దీనిలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉందని గుర్తిస్తే- మరికొన్ని హార్మోన్‌ పరీక్షలు, జన్యుపరీక్షలు అవసరమవ్వచ్చు. స్త్రీలలో ప్రాథమికంగా హార్మోన్‌ (రక్త) పరీక్షలు, అండాలు సజావుగా విడుదల అవుతున్నాయా? లేదా? తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ పరీక్షలు, ట్యూబులు ఎలా ఉన్నాయన్నది చూసేందుకు ఎక్స్‌-రే లేదా ల్యాప్రోస్కోపీ చేయిస్తారు. ఫలితాలను బట్టి మరికొన్ని పరీక్షలూ అవసరమవ్వచ్చు, వీటి ఆధారంగా ఎటువంటి చికిత్స అవసరమన్నది నిర్ధారిస్తారు.
పిల్లలు పుట్టకపోవటానికి ప్రధాన కారణాలేమిటి?
గర్భధారణ అన్నది అతి సహజంగా జరిగిపోయేదే అయినా తరచి చూస్తే ఇది ఒక రకంగా అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రతి నెలా స్త్రీ అండాశయాల్లో విడుదలయ్యే అండం- ఫలోపియన్‌ ట్యూబుల ద్వారా గర్భాశయం వైపు ప్రయాణిస్తుంటుంది. ఇదే సమయంలో పురుషుడి వీర్యంలోని శుక్రకణాలు వచ్చి దాన్ని చేరుకుని.. వాటిలో ఒకటి అండాన్ని ఫలదీకరణం చెందిస్తే.. అది సూక్ష్మపిండంగా ఏర్పడి.. గర్భాశయంలోకి ప్రవేశించి.. గర్భాశయం గోడలకు అతుక్కుని అక్కడ పిండంగా పెరగటం ఆరంభిస్తుంది. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఇదీ గర్భధారణ ప్రక్రియ! ఈ ప్రక్రియ మొత్తాన్ని రుతుక్రమంలో సమయానుకూలంగా రకరకాల హార్మోన్ల నుంచి శరీర భాగాల వరకూ ఎన్నో అంశాలు నియంత్రిస్తుంటాయి. అందుకే వీటిలో ఎక్కడ, ఏ దశలో లోపం తలెత్తినా గర్భధారణ క్లిష్టతరంగా మారుతుంది.
స్త్రీలలో:
*
అండాల సమస్యలు: సంతానం కలగని చాలామంది స్త్రీలలో ఎక్కువగా కనబడేది హార్మోన్ల సమస్య. హార్మోన్ల అస్తవ్యస్తం వల్ల నెలసరి సక్రమంగా రాక, అండాలు విడుదల కాక.. పరిస్థితి సంతాన రాహిత్యానికి దారి తీస్తుంది. ఇలాంటి వారిలో అండాల విడుదలను ప్రభావితం చేస్తున్న అతి ముఖ్యమైన సమస్య- అండాశయాల్లో నీటి తిత్తులుండటం. దీన్నే 'పాలి సిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌(పీసీఓఎస్‌)' అంటారు.

*
ట్యూబుల సమస్యలు: అండాశయం నుంచి విడుదలైన అండాన్ని ఫలోపియన్‌ ట్యూబులు పట్టుకుంటాయి. పురుషుడి వీర్యం నుంచి వచ్చే శుక్రకణం ఈ అండాన్ని చేరుకుని, ఫలదీకరణం జరగటమన్నది ఈ ట్యూబుల చివర్లో జరుగుతుంది. అందుకే ఒకవేళ ఈ ట్యూబులు మూసుకుపోయినా, దెబ్బతిన్నా గర్భధారణ కష్టంగా మారుతుంది. ఈ ట్యూబులు మూసుకుపోవటానికి లైంగికంగా సంక్రమించే గనేరియా, క్లమీడియా వంటి సుఖవ్యాధులు, అబార్షన్ల తర్వాత ఇన్ఫెక్షన్లు సోకటం వంటివి ముఖ్యకారణాలు. ప్రత్యేకించి మన దేశంలో పునరుత్పత్తి అవయవాలకు 'క్షయ' (టీబీ) సోకటం కూడా మరో కీలకాంశంగా నిలుస్తోంది. మొత్తానికి సంతాన రాహిత్యానికి 15% వరకూ ఈ ట్యూబుల సమస్యలే కారణమవుతున్నాయి.

*
ఎండోమెట్రియోసిస్‌: స్త్రీలలో గర్భాశయం లోపలివైపు గోడలకు ఉండే మృదువైన పొరభాగం (ఎండోమెట్రియం) ప్రతి నెలా హార్మోన్ల ప్రభావంతో మందంగా తయారవుతుంటుంది. ఒకవేళ గర్భధారణ జరిగితే పిండం కుదురుకునేందుకు ఉపయోగపడే ఈ మెత్తటి పొర.. గర్భధారణ జరగకపోతే.. విడివడిపోయి.. రుతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. (ఇదే బహిష్టు స్రావం). కొద్దిమంది స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర- గర్భాశయం లోపలే ఉండకుండా దాని వెలుపలకు కూడా వచ్చి ఫలోపియన్‌ ట్యూబుల్లో, అండాశయాల మీద.. ఇలా రకరకాల ప్రదేశాల్లో స్థిరపడి.. నెలానెలా హార్మోన్లకు అక్కడే స్పందిస్తూ.. వాపు, స్రావాల వంటివి తెచ్చిపెడుతూ సమస్యాత్మకంగా తయారవుతుంది. దీన్నే 'ఎండోమెట్రియోసిస్‌' అంటారు. స్త్రీలలో సంతాన రాహిత్యానికి ఇది కూడా ఒక ముఖ్యకారణం.

*
చెప్పలేని పరిస్థితి: కొద్దిమందిలో అండాలు సక్రమంగా విడుదల అవుతూనే ఉంటాయి. పరీక్షించి చూస్తే ట్యూబులూ బాగానే ఉన్నట్టు కనబడతాయి. భాగస్వామి వీర్యంలో శుక్రకణాలూ అన్నీ సజావుగానే ఉంటాయి. అయినా వీరికి గర్భం మాత్రం రాదు. దీనర్థం గర్భధారణ ప్రక్రియకు సంబంధించి పరీక్షల్లో కూడా గుర్తించలేనంతటి సూక్ష్మస్థాయిలోనో, లేక పిండం గర్భాశయంలో కుదురుకోవటంలోనో.. ఎక్కడో తేడా ఉందని! ఇటువంటి వారికి 'ఐయూఐ', 'ఐవీఎఫ్‌' వంటి సంతానసాఫల్య చికిత్సా విధానాలే ఉత్తమ మార్గం.
పురుషుల్లో
పురుషుడి వీర్యంలో- ప్రధానంగా శుక్రకణాల సంఖ్య తగినంతగా ఉండాలి, అవి చురుకుగా తిరుగుతుండాలి, వాటి ఆకృతి (మార్ఫాలజీ) కూడా బాగుండాలి. ప్రతి మిల్లీలీటరుకూ కనీసంగా 1.5 కోట్లకు పైగా శుక్రకణాలుండటం సహజం. వీటిలో కనీసం 50% శుక్రకణాలు చురుకుగా తిరుగుతుండాలి. వీర్య పరీక్షలో ఇవన్నీ సజావుగా ఉన్నాయా? లేదా? అన్నది పరీక్షిస్తారు. సంతాన రాహిత్యం ఉన్న వారిలో- కొందరిలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. మరికొందరిలో అస్సలు శుక్రకణాలే ఉండకపోవచ్చు. తగినన్ని శుక్రకణాలు చురుకుగా లేకపోవటం, వాటి ఆకృతులు సరిగా లేకపోవటం వంటివీ సంతాన రాహిత్యానికి కారణమవుతాయి. పొగ, మద్యం, తీవ్రమైన ఒత్తిడి, ఊబకాయం వంటి వంటివాటి వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గిపోవచ్చు. వీటిని సరిదిద్దుకుంటే కొన్నిసార్లు సంతానావకాశాలు మెరుగవుతాయి. ఇక హార్మోన్‌ల సమస్యలు, సుఖవ్యాధులు/క్షయ వల్ల వీర్యనాళాలు మూసుకుపోవటం, జన్యుపరమైన కారణాల వల్ల క్రోమోజోముల్లో తేడాలుండటం.. తదితరాలు కూడా పురుషుల్లో సంతాన రాహిత్యానికి కారణమవుతాయి. 40% మందిలో ప్రత్యేకించి కారణమేదీ లేకుండానే వీర్యంలో తేడాలుండొచ్చు. ఇటువంటి వారికి 'ఐయూఐ', 'ఐవీఎఫ్‌' వంటి పద్ధతులు ఆశ్రయించాల్సి వస్తుంది. అసలు వీర్యంలో శుక్రకణాలే లేని వారికి కూడా నేరుగా వృషణాల నుంచే శుక్రకణాలు తీసి(టీసా), వాటితో భాగస్వామి అండాన్ని ఫలదీకరణం చెందించే అత్యాధునిక విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి
చికిత్స ఏమిటి?
స్త్రీలలో సాధారణంగా అండాల విడుదలను ప్రేరేపించేందుకు మందులు ఇవ్వటం, ట్యూబుల్లో కొద్దిపాటి తేడాలున్నా, ఎండోమెట్రియోసిస్‌ వంటి సమస్యలున్నా వాటిని ల్యాప్రోస్కోపీ సర్జరీ విధానంలో సరిచెయ్యటం అవసరం. కొందరికి వీటితోనే గర్భధారణ సాధ్యమవుతుంది. మరికొందరికి 'ఐయూఐ', 'ఐవీఎఫ్‌', 'ఐసీఎస్‌ఐ-ఇక్సి' వంటి సంతాన సాఫల్య చికిత్సా విధానాలు (వీటి గురించి కింద వివరంగా) అనివార్యమవుతాయి. పురుషుల్లో సమస్యలుంటే చాలా వరకూ వీటితోనే అధిగమించాల్సి వస్తుంది.

సంతాన రాహిత్యానికి ప్రత్యేకించి ఈ రంగంలో శిక్షణ, తర్ఫీదు పొందిన స్పెషలిస్ట్‌ల వద్ద చికిత్స తీసుకోవటం అత్యుత్తమం. దీనివల్ల సంతానావకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఒక జంటకు పిల్లలు పుట్టటం లేదంటే దానర్థం వారికి ఇంకెప్పటికీ పుట్టరని కాదు. చాలామందిలో సంతానావకాశాలను పెంచేందుకు- ఆధునిక వైద్యవిధానాలు సహాయకారిగా గర్భధారణకు ఎంతో దోహదం చేస్తాయి. ఈ చికిత్సలతో గర్భధారణ అవకాశాలను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. మొత్తమ్మీద ప్రస్తుతం సంతానం కోసం స్పెషలిస్టు చికిత్సలను ఆశ్రయిస్తున్న వారిలో- కనీసం 75% జంటలు చికిత్సా క్రమంలో విజయం సాధిస్తున్నట్టు గుర్తించారు.

సహజంగా సంతానం కలగకపోవటమన్నది దంపతులను రకరకాలుగా ఎన్నో ఒత్తిళ్లకు గురి చేస్తుంది. దీనివల్ల వీరిలో నిస్సహాయత, ఆగ్రహం, సిగ్గు, నలుగురిలో కలవలేకపోవటం, ఆవేదన వంటి రకరకాల మనోభావాలు పెల్లుబుకుతుంటాయి. చాలామంది కుంగుబాటుకు (డిప్రెషన్‌) కూడా లోనవుతుంటారు. వీటిని అధిగమించేందుకు నిపుణుల కౌన్సెలింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే సంతాన సాఫల్య చికిత్సల్లో కౌన్సిలింగ్‌ది కీలక పాత్ర.
ఐయూఐ
'
ఐయూఐ' అంటే 'ఇంట్రా యూటరీన్‌ ఇన్‌సెమినేషన్‌'. సంతాన సాఫల్య చికిత్సల్లో దీన్ని ప్రాథమికమైనదిగా చెప్పుకోవచ్చు. దీనిలో- భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలలో పరీక్షించి, దానిలోని అసహజమైన కణాల వంటివాటన్నింటినీ తొలగించి, కేవలం ఆరోగ్యకరంగా, చురుకుగా ఉన్న వాటినే సిద్ధం చేస్తారు. అలా సిద్ధం చేసిన వీర్యాన్ని ఒక సన్నటి మెత్తటి గొట్టం ద్వారా నేరుగా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఎటువంటి నొప్పీ లేని, 5 నిమిషాల్లో పూర్తయిపోయే తేలిక విధానం ఇది. స్త్రీలో అండం విడుదల అయ్యే రోజులేవో గుర్తించి, ఆ రోజుల్లోనే ఈ చికిత్స చేస్తారు. ఇదే సమయంలో స్త్రీలో మరిన్ని అండాలు పక్వమై విడుదలయ్యేందుకు మందులు కూడా ఇస్తారు. అవసరాన్నిబట్టి ఇలా 6 రుతుచక్రాల వరకూ కూడా 'ఐయూఐ' చికిత్స చెయ్యచ్చు. ఇలా ఒక నెలలో చేస్తే సంతానావకాశాలు 15% వరకూ ఉంటాయి. సాధారణంగా 3-4 రుతుచక్రాల్లోనే గర్భం రావొచ్చు. 6 రుతుచక్రాల పాటు ఈ చికిత్స చేసినా ఫలితం లేకపోతే 'ఐవీఎఫ్‌' వంటి పైస్థాయి చికిత్సలను సూచిస్తారు.
ఐవీఎఫ్‌
ఐవీఎఫ్‌ అంటే 'ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌'. దీన్నే 'టెస్ట్‌ట్యూబ్‌ బేబీ' విధానమనీ అంటుంటారుగానీ.. దీనర్థం పిల్లలను టెస్ట్‌ట్యూబుల్లో పెంచుతారనేం కాదు. దీనిలో ముందు స్త్రీ నుంచి- పక్వమైన అండాలను బయటకు తీస్తారు. వాటిని ప్రయోగశాలలో ఒక డిష్‌లో ఉంచి- పురుషుడి శుక్రకణాలతో బయటే ఫలదీకరణం చెందిస్తారు. ఇలా ఫలదీకరణం చెందగా ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు లేదా మూడింటిని తిరిగి స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. అవి అక్కడ కుదురుకుని, పిండంగా పెరగటం ఆరంభిస్తాయి. ఈ విధానంలో ప్రపంచంలోనే తొలిబిడ్డ 1978లో పుట్టింది. ఈ మూడున్నర దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది బిడ్డలు ఇలా పుట్టారు. అద్భుత ఫలితాలతో సంతాన సాఫల్య చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందీ విధానం. దీనితో ప్రతి దఫా 30-35% విజయావకాశాలుంటాయి.
ఐసీఎస్‌ఐ-ఇక్సి
ఐసీఎస్‌ఐ అంటే 'ఇంట్రా సైటోప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజక్షన్‌'. ఇది ఐవీఎఫ్‌ చికిత్సకే మరికాస్త మెరుగులు దిద్దిన విధానం. దీనిలోనూ ముందు స్త్రీ నుంచి అండాలను సేకరిస్తారు. ప్రయోగశాలలో ఆ అండాల్లోకి- పురుషుడి ఒక శుక్రకణాన్ని ప్రత్యేకమైన 'మైక్రోమ్యానిప్యులేటర్‌' పరికరం సహాయంతో ఆ అండంలోకి ప్రవేశపెట్టి, ఫలదీకరణం చెందిస్తారు. అలా ఫలదీకరణం చెందిన వాటిని తిరిగి స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఈ విధానంతో ప్రతి దఫా విజయావకాశాలు 40% వరకూ ఉంటాయి.
శుక్రకణాల సంఖ్య బాగా తక్కువగా ఉన్న పురుషుల విషయంలో ఈ చికిత్స ఎంతగానో ఉపకరిస్తుంది. అసలు శుక్రకణాలే లేనివారిలో సైతం వృషణాల నుంచి నేరుగా శుక్రకణాలను బయటకు తీసి (టీఈఎస్‌ఏ) ఈ ఇక్సీ పద్ధతిలో అండాన్ని ఫలదీకరణం చెందించవచ్చు.
మరెన్నో!
ఇటీవలి కాలంలో సంతాన సాఫల్య చికిత్సల్లోకి మరెన్నో కొత్తకొత్త విధానాలు వచ్చి చేరుతూ వీటి విస్తృతిని పెంచుతున్నాయి. ముఖ్యంగా అండాలను లేదా శుక్రకణాలను తీసి భవిష్యత్‌ అవసరాల కోసం ప్రయోగశాలలో అతిశీతలంగా భద్రపరచి ఉంచటం; ప్రయోగశాలలో ఫలదీకరణం చెందించిన సూక్ష్మపిండాల్లో స్త్రీగర్భాశయంలో ప్రవేశపెట్టగా మిగిలిన అదనపు పిండాలను అతిశీతలంలో (క్రయోప్రిజర్వేషన్‌) ఉంచి, వాటినే తర్వాత వాడటం; అవసరాన్ని బట్టి అండాలనుగానీ శుక్రకణాలనుగానీ దాతల నుంచి స్వీకరించి చికిత్సల్లో వాడటం; పిండాన్ని మరో స్త్రీ గర్భాశయంలో పెంచే అవకాశం ఉండటం (సరోగసీ)- ఇటువంటి వినూత్న విధానాలెన్నో అందుబాటులోకి వచ్చాయి.
స్త్రీల సమస్యే కాదు!
మన సమాజంలో నేటికీ బలంగా పాతుకుపోయిన అపోహ ఏమంటే- స్త్రీలో ఏదో లోపం ఉండటం వల్లనే పిల్లలు పుట్టటం లేదని నమ్ముతుంటారు. ఇది పూర్తి అవాస్తవం. దీనివల్ల ఎన్నో కుటుంబాల్లోనూ, సమాజంలోనూ కలతలు, కలహాలు కూడా రేగుతున్నాయి. కానీ వాస్తవాలు చూస్తే- సంతాన రాహిత్యంతో సతమతమవుతున్న మొత్తం జంటల్లో కేవలం 35% మందిలోనే స్త్రీలలో లోపాలుంటున్నాయి. మరో 35% కేసుల్లో పురుషుల్లో లోపాలుంటున్నాయి. మిగిలిన 30% జంటల్లో ఇద్దరిలో లోపం ఉండటమో, లేక సరిగా నిర్ధారించలేని ఇతరత్రా సమస్యలేమైనా ఉండటమో జరుగుతోంది. కాబట్టి సంతాన రాహిత్యాన్ని ప్రత్యేకించి స్త్రీల సమస్యగా, స్త్రీ లోపంగా చూడటం సరికాదు.
అమ్మాయి వయసు
స్త్రీ వయసు పెరుగుతున్న కొద్దీ సంతానావకాశాలు తగ్గుతుంటాయి. నెలనెలా విడుదలయ్యే అండాలు ఒక వయసు దాటిన తర్వాత అంత నాణ్యంగా ఉండకపోవటం దీనికి ఒక ముఖ్యకారణం. అలాగే వయసు పెరిగే కొద్దీ అబార్షన్లయ్యే అవకాశాలూ ఎక్కువ. వీటికి తోడు చిన్నవయసు స్త్రీలతో పోలిస్తే పెద్దవయసు వారిలో క్రోమోజోముల్లో, జన్యువుల్లో తేడాల వల్ల వీరికి పుట్టే పిల్లలకు రకరకాల లోపాలూ రావచ్చు. 40 ఏళ్లు దాటిన స్త్రీలకు అత్యాధునిక సంతాన చికిత్సలతో కూడా సాఫల్యాల రేటు తక్కువగానే ఉంటుంది. వాస్తవానికి 20-25 ఏళ్ల మధ్య స్త్రీలలో సంతానావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 30లలో క్రమేపీ సన్నగిల్లుతూ, 35 ఏళ్ల తర్వాత మరింతగా తగ్గిపోతాయి. కానీ ఉద్యోగ బాధ్యతలు, లేటు వయసు పెళ్లిళ్ల వంటి వాటి వల్ల నేడు ఎంతో మంది స్త్రీలు వయసు మీరే వరకూ సంతానాన్ని కోరుకోవటం లేదు. దీనివల్ల కూడా సంతాన రాహిత్యం పెరుగుతోంది.


---------------------------------------------------------------------------------------------------------


25th July - సత్ సంతాన ప్రాప్తికై "వైనతేయేష్టి"

సంతానమంటే...ఎడతెగని పరంపర, ఎదతావులను విరజిమ్మే తామరతంపర.  మనం పాటించే ధర్మాలను, ఆచారాలను, సంప్రదాయాలను నిరంతరంగా, నిత్యనూతనంగా ప్రవహింపచేసేదే సంతానం. సంతానం కేవలం మనకు ప్రతిరూపమే కాదు. మన ఆశయాలకు, ఆచారాలకు కూడా ప్రతిరూపం కావాలి. మన సంప్రదాయాలను మరో తరానికి అందించేదే "సత్సంతానం". అన్ని తరాలు సాగినా, అన్ని అంతరాలు కలిగినా వంశపు తత్త్వాన్ని సమృద్ధం చేసేదే సత్సంతానం. అది లేని బంధాలు అడవికాచిన వెన్నెలలే! అలా బ్రతుకులు వ్యర్థంకాకుండా ఉండాలంటే సత్సంతానం కావాలి. అది కూడా ముసలితనంలో పెద్దల్ని పోషించేది కావాలి. మన ఆచారాలను, సంప్రదాయాలను ముందు తరాలకు అందించగలిగే సత్సంతానమై ఉండాలి. అలాంటి ఆశయంతోనే త్రేతాయుగంలో దశరథుడు "పుత్రకామేష్టి" ని ఆచరించాడు. యుగయుగాలకు చెదరని ఆదర్శమూర్తులైన శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులనే పుత్రులను పొందాడు. నేటికీ కీర్తి మూర్తిగా ప్రకాశిస్తున్నాడు. అలాంటి సంతానం కోసం సామాన్యమానవుడు ఏం చేయాలి ? "అపుత్రస్య గతి ర్నాస్తి" అనే శాపం నుండి ఎలా బయట పడాలి ? ఇది లోక హితైషి అయిన బ్రహ్మ దేవుని ప్రశ్న. దానికి స్వామి చెప్పిన సమాధానమే ఈ వైనతేయేష్టి.

సంతానం లేకపోవడానికి ఎన్నో కారణాలు. అవి నాగదోషాలు కావచ్చు, రాగదోషాలు కావచ్చు. అన్నింటినీ శమింపచేసే అద్భుతమైన ఇష్టి "వైనతేయేష్టి", దీనికే "పుత్రకామేష్టి" అని మరో పేరు.

యత్కృత్వా యజ్ఞకర్తా చ తత్సహాయక సజ్జనాః |
శీఘ్రం విందంత్యభీష్టార్థాన్ ప్రాప్నువంతి సుతాన్ సతః ||

దీనిని ఆచరించిన వారికేకాదు, వారికి సహకరించిన సజ్జనులందరికీ సర్వాభీష్టాలు నెరవేరుతాయి అని పరమాత్మ చెప్పిన పుత్రేష్టి ఇది! ఆచరించండి! సంతానాన్ని పొంది సత్సమాజాన్ని పెంపొందించండి!!













  ---------------------------------------------------------------------------

అద్దె తల్లులు

ఆదివారం అనుబంధం - కె. అంజన    Sun, 18 Dec 2011, IST   ప్రజాశక్తి  దినపత్రిక
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
అంగడిలో దొరకనిదీ అమ్మ ఒక్కటే
అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే అన్నాడో సినీ కవి.
ఆ పాట రాసే నాటికి అమ్మను అంగట్లో కొనలేమన్నది అక్షర సత్యం. ఇప్పుడు అమ్మ (అమ్మ గర్భం) కూడా అంగడి సరకే. డాలర్లకు పిల్లలు పుడతారిక్కడ. సరొగసీ ప్రక్రియ వారి పాలిట వరంగా మారింది. పేదరికంలో మగ్గిపోయే అద్దెతల్లులకు కొదవలేని భారతగడ్డ నిస్సంతులకు ప్రీతిపాత్రమైన ప్రాంతంగా తయారైంది. తమ రక్తం పంచుకు పుట్టే బిడ్డకోసం సప్త సంద్రాలు దాటి భారత గడ్డమీద అడుగెడుతున్నారు. మన దేశంలో సైతం ఆమిర్‌ఖాన్‌ వంటి సెలబ్రిటీలు, వ్యాపారస్థులు అద్దె తల్లులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని ఫణంగా పెట్టి పరాయివారి బిడ్డలను కనిపెడుతున్నారు అద్దె తల్లులు. పేగు బంధం సైతం వ్యాపారమైంది.
మధ్య అడపా దడపా వినిపిస్తున్న మాట 'సరొగసీ'. ఏళ్ల తరబడి పిల్లలకోసం ఎదరుచూసిన విదేశీయులకు సరొగసీ వరంగా మారింది. అనేక సార్లు అబార్షన్లయినవారు, ఐవిఎఫ్‌ పద్ధతి విఫలమైనవారు, గర్భసంచి సంబంధిత సమస్యలున్నవారు సొంత బిడ్డల కోసం మన గడ్డపై కాలు మోపుతున్నారు. బ్రిటన్‌కి చెందిన నిక్కి, బాబీ బైన్స్‌ ఆ కోవకు చెందిన వారే. వీరు పిల్లల కోసం ఎంతగానో తపించారు. 13 ఏళ్లపాటు తిరగని ఆసుపత్రి లేదు. కలవని వైద్యులు లేరు. నీళ్లలా పౌండ్లు ఖర్చు చేశారు. అయినా వారి వడి నిండలేదు. పైగా అక్కడ అద్దె తల్లులు దొరకడం కూడా కష్టమే. ఒక వేళ లభించినా చాలా అరుదుగా వుంటారు. అన్ని అనుమతులూ పొందడానికి బోలెడంత సమయం పడుతుంది. దాంతో వారు గంపెడాశతో ఇండియా వచ్చారు. ఇక్కడ కూడా పదికిపైగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వైద్య ఖర్చులకే లక్షల రూపాయలు వెచ్చించారు. చివరగా గుజరాత్‌లోని ఆనంద్‌ చేరుకొని అద్దె తల్లిని సంపాదించారు. పండంటి బిడ్డతో సంతోషంగా స్వదేశం చేరారు. ఇలాంటి విదేశీ కేసులను చెప్పుకోడానికి పేజీలు చాలవు. అందాకా ఎందుకు? మన దేశంలోనూ సంతానం కోరుకునేవారు సరొగసీని ఎంచుకుంటున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఒకరు ఈ పద్ధతిద్వారానే లీలావతి ఆసుపత్రిలో పండంటి బిడ్డను కన్నారు. అతని భార్యకు 9సార్లు ఐవిఎఫ్‌ ప్రయత్నించగా విఫలమైంది. దాంతో అద్దెతల్లిని ఆశ్రయించారు.
మనది ఎల్లలు లేని దరిద్రం. పైసలు కావాలి. కొన్ని సంవత్సరాలపాటు రెక్కలు ముక్కలు చేసుకున్నా రాని సంపాదన ఒక్కసారి గర్భాన్ని అద్దెకు ఇచ్చినందుకు వస్తుంటే ఎలా కాదంటారు? గుజరాత్‌లోని ఆనంద్‌కి చెందిన మంజుల గాథ అలాంటిదే. ఈమె నాలుగిళ్లలో పాచిపని చేసుకుంటుంది. భర్త తాగుబోతు. పైసా సంపాదించడు. పైగా ముగ్గురు పిల్లలు. పిల్లల భవిష్యత్తు కోసం అద్దె తల్లి అవతారమెత్తి 3.5 లక్షల రూపాయలు సంపాదించింది. 2.85 లక్షలతో ఇల్లు కొని మిగతా పైకాన్ని పిల్లల చదువుకోసం అట్టిపెట్టింది. కాజల్‌ది మరో కథ. అప్పులపాలైన భర్త ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆ పరిస్థితుల్లో గర్భాన్ని అద్దెకిచ్చింది. తద్వారా వచ్చిన మొత్తంలో భర్త కిరాణా కొట్టు కోసం 3 లక్షల రూపాయలు కేటాయించింది. కొడుకు చదువు కోసం 50 వేల రూపాయలు బ్యాంకులో వేసింది. పై సంఘటనలు చూస్తుంటే డాలర్లు పిల్లలు పెడతాయన్న పెద్దల మాట నిజమే సుమా అనిపించకమానదు.
ఇక్కడే ఎందుకు?
మన మాత్రం నైపుణ్యం కలిగిన వైద్యులు, సాంకేతిక పరిజ్ఞానం విదేశాల్లోనూ వుంది. కానీ బిడ్డలు కావాలనుకున్న వారు వెతుక్కుంటూ భారతదేశానికే ఎందుకు వస్తున్నారు? ఇక్కడివారి గర్భాలనే ఎందుకు అద్దెకు తీసుకొంటున్నారు? భారతదేశంలో కార్మికులే కాదు. అద్దె తల్లులు కూడా చవకే. భారత్‌ చవకబారు సంతలా.... బిడ్డలను కనిచ్చే ఔట్‌ సోర్సింగ్‌ కేంద్రంగా మారింది. బిడ్డలకోసం తహతహలాడిపోయే విదేశీ తల్లిదండ్రులు రెక్కలు కట్టుకొని ఇక్కడ వాలిపోవడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. అమెరికాలో సరొగసీ ద్వారా బిడ్డను పొందడానికి 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అదే ఇండియాలో అయితే 5 నుంచి 10 లక్షల రూపాయలతో పనైపోతుంది. పండంటి బిడ్డతో తిరుగు విమానం ఎక్కవచ్చు. పైగా ఇక్కడ మాతృభాష తర్వాత ఆంగ్లాన్నే ఎక్కువగా వినియోగిస్తారు. దీంతో వైద్యుల నుంచి వైద్య సిబ్బంది వరకు ఎవరితో మాట్లాడాలన్నా విదేశీయులకు భాషా సమస్య ఉత్పన్నం కాదు. తమ పని చక్కబెట్టుకోవడం సులభం. ఇంకా ఇక్కడ సంతాన సామర్థ్యం అధికం.
మన దేశంలో దత్తతుపై స్పష్టమైన చట్టాలున్నాయి. సరొగసీకి సంబంధించి మాత్రం లేవు. అలాగని ఇది చట్ట వ్యతిరేకం కాదు. నామకః కొన్ని మార్గదర్శకాలున్నాయి. పైగా డబ్బు చెల్లించి అద్దె గర్భం ద్వారా బిడ్డను కనే ప్రక్రియ (సరొగసీ ) కు 2002లో సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. దాంతో ఈ తంతు చట్టబద్ధంగానే నడుస్తోంది. అప్పటి నుంచి సంతానలేమితో బాధపడుతున్న అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ వంటి దేశాల నుంచి ఎందరో నిస్సంతులు ఇండియా వస్తున్నారు. ఐవిఎఫ్‌, సరొగసీ ద్వారా బిడ్డను కంటున్నారు. 2005లో మాత్రం అత్యున్నత న్యాయస్థానం సరొగసీకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది. దాని ప్రకారం అసలు తల్లిదండ్రులు ... బిడ్డను నవమాసాలు మోసి కనబోయే మహిళ, ఆమె భర్త ...కాంట్రాక్టు పత్రాలు రాసుకోవాలి. బిడ్డ పుట్టే వరకు అద్దె తల్లికి ఆర్థిక మద్దుతు ఇవ్వాల్సి వుంటుంది. అండము, వీర్యము కూడా అసలు తల్లిదండ్రులదే అయివుండాలి. అద్దె తల్లి అండాన్ని ఉపయోగించకూడదు. అన్నిటినీ మించి ఈమె ఎవరో కూడా గోప్యంగా వుంచాలి. బహిర్గతం చేయకూడదు. ఆర్థికపరమైన సంరక్షణ కూడా కల్పించాలి. వీటిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడడం కోసమే ప్రభుత్వం 'ఎఆర్‌టి (అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ) నియంత్రణ బిల్లు 2010'ను రూపొందించింది.
కొన్ని దేశాల్లో సరొగసీకి సంబంధించిన చట్టాలు బలంగా, స్పష్టంగా వున్నాయి. కొన్ని దేశాల్లో ఒకరి బిడ్డను మరొకరు కనడానికి చట్టాలు అంగీకరించవు కూడా. కెనడా ప్రభుత్వం 2004లో కమర్షియల్‌ సరొగసీని నిషేధించింది. బ్రిటన్‌లోనూ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోనూ చట్టవ్యతిరేకమే. అయితే ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌, జార్జియా చట్టాలు మాత్రం ఇందుకు అంగీకరిస్తున్నాయి. అద్దె గర్భంతో పిల్లల్ని కనడానికి అనుమతి లేదు. ఒకవేళ వున్నా బోలెడన్ని షరతులు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అనుమతి వుంటే కొన్ని రాష్ట్రాల్లో నేరం. బిడ్డను మోస్తున్న మహిళకు కూడా అనేక హక్కులుంటాయి. పారాయివాళ్ల బ్డియితేనేం. తన కడుపులో వున్నందున మమకారం పెంచుకుని 'ఇవ్వను' అని అడ్డం తిరిగినా ఏం చేయలేరు. మరి మనకో! అద్దె తల్లులకు ప్రత్యేకంగా ఎటువంటి హక్కులూ లేవు. అసలు తల్లిదండ్రులపై ఎలాంటి నిబంధనలూ లేవు. పైగా మన దేశంలో పేదరికానికి ఆకాశమే హద్దు కావడం కూడా విదేశీయుల పాలిటి వరంగా మారింది. రోజంతా కాయకష్టం చేసినా కడుపునిండని పేద, దిగువమధ్య తరగతి వారే ఆ డబ్బుకోసం తమ గర్భాన్ని అద్దెకివ్వడానికి ముందుకొస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యులు సైతం దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ చక్రంలో దళారులది లాభాల పంట. వైద్య పరీక్షలు, చికిత్స, మందులు తీసుకుంటూ ప్రాణాలకు తెగించి గర్భాన్ని అద్దెకిచ్చినవారికి నామమాత్రపు పైకం అందుతుంది. నాలుగు మాటలు చెప్పే దళారులకు మాత్రం లాభాల పంట పండుతోంది. కష్టం ఒకరిది. ఫలితం మరొకరిది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, అహ్మదాబాదు, హైదరాబాదు వంటి నగరాలు ఇలాంటి ఆసుపత్రులు సంతాన సాఫల్య కేంద్రాలుగా వర్థిల్లుతున్నాయి. దేశదేశాల నుంచి సంతానం కోరుకునేవారెందరో ఇక్కడకు వస్తున్నారు.
ఆనంద నిలయం
గుజరాత్‌లోని ఆనంద్‌ ప్రాంతం పాల విప్లవానికే కాదు అద్దె తల్లులకూ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. దేశదేశాల్లో ఈ పేరు మారుమోగిపోతోంది. 'ఆకాంక్ష' వంటి సంతాన సాఫల్య కేంద్రాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. స్కూలు పిల్లల సంక్షేమ హాస్టళ్ల మాదిరి వీటిని నిర్వహిస్తుంటారు. మూడేసి అంతస్తులున్న భవనాలను అద్దెకు తీసుకొని మరీ వీటిని నడుపుతుంటారు. ఇక్కడో విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. భవనంలో కన్పించేవారంతా మహిళలే. అందరూ గర్భవతులే. కాకపోతే వారు మోసేది మాత్రం తమ సొంత బిడ్డలను కాదు. విదేశీ బిడ్డలను. నవమాసాలు మోసి కని ఇచ్చి వెళ్లిపోవాలి. అంతవరకే వారి పని. అందుకోసం వారికి చక్కటి ఆహారం, వైద్యం, వసతి అందిస్తారు. అయితే బిడ్డను కనిచ్చే వరకు ఆ భవనాన్ని దాటిపోవడానికి లేదు. భర్తా పిల్లలూ ఎప్పుడైనా తమను చూడాలనిపిస్తే అక్కడికి వెళ్లొచ్చు. అదీ పగటిపూట మాత్రమే అనుమతి లభిస్తుంది. పిల్లలను, భర్తను వదిలి అన్ని నెలల పాటు వంటరిగా కానివారి మధ్య, పరాయి బిడ్డను మోయడమంటే చిన్న విషయం కాదు. పైగా తాము మోస్తున్న బిడ్డమీద మాత్రం వారికి ఎటువంటి మమకారం వుండకూడదు. తర్వాత ఆ బిడ్డకు లాలపోయడానికి, జోల పాడడానికి, రాత్రుళ్లు కథలు చెప్పడానికి కూడా వుండదు. వారెక్కడో వీరెక్కడో. బిడ్డను ఇచ్చేసి తమకు ముట్టచెప్పిన పైకంతో తొమ్మిది నెలల తర్వాత సొంత గూటికిి చేరతారు. పిల్లల చదువుకోసం, అప్పులు తీర్చడంకోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం, ఆటో/ఇల్లు కొనుక్కోవడం కోసం ఆ డబ్బును వెచ్చిస్తారు. పేదరికమే అందుకు వారిని ఒప్పిస్తుంది.
'గే'లూ పిల్లలు కనొచ్చు!
ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు 'గే' వివాహాలను, సహజీవనాన్ని అనుమతిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎంత అనుమతించినా, సమాజం చూసీచూడనట్టు వదిలేసినా అసహజ బంధాలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయి. బిడ్డలు కావాలన్న కోరికను చంపుకోలేరు. అటువంటి వారికి సైతం సరొగసీ వరంగా మారింది. అందుకు అత్యంత అనువుగా వున్న భారతదేశం వారికి ప్రియాతిప్రియమైన ప్రదేశంగా మారింది. అలాంటి జంటే ఇజ్రాయిల్‌కి చెందిన యొనాటన్‌-ఒమర్‌ఘెర్‌. అందరిలాగే తమ ఇంట్లోనూ పిల్లల కేరింతలు వినిపించాలనుకున్నారు. అందుకోసం మొట్టమొదటిసారిగా 2008 జనవరిలో ముంబై వచ్చారు. బంద్రాలోని సంతానసాఫల్య కేంద్రంలో వైద్యులు యొనాటన్‌ వీర్యం సేకరించి మరొక దాత అండంతో ఫలదీకరించి అద్దెతల్లి గర్భంలో ప్రవేశపెట్టారు. తొమ్మిది నెలల నిరీక్షణ అనంతరం ఆ 'గే' జంట కలల పంట చేతికొచ్చింది. ముద్దులొలికే బిడ్డను తీసుకొని ఆ జంట స్వదేశం వెళ్లిపోయింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 377 సెక్షన్‌ ప్రకారం 'స్వలింగ సంపర్కం' అసహజ ప్రక్రియే అయినప్పటికీ ఇండియాలో 'గే', 'లెస్బియన్‌' జంటలు అద్దె గర్భం ద్వారా బిడ్డను కనడానికి ఎటువంటి ఆటంకం లేదనడానికి ఇదో ఉదాహరణ.
తొలి అద్దె తల్లి
'ఇంతకీ మన దేశంలో తొలిసారిగా తన గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ ఎవరబ్బా?!' అన్న ప్రశ్న మెదళ్లను తొలచివేస్తుంది. 1994 జూన్‌ 23న మన దేశంలో తొలిసారిగా అద్దె గర్భంలో ఊపిరి పోసుకున్న చిన్నారి భూమి మీదకొచ్చింది. ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియడానికి ఎనిమిదేళ్లు పట్టింది. బ్రిటన్‌లో నివసించే తన కుమార్తె కోసం ఓ తల్లి తన గర్భాన్ని అరువిచ్చిన అరుదైన సందర్భమది. అయితే అప్పటికీ ఇప్పటికీ వైద్య రంగంలోనేగాక సమాజ ఆలోచనల్లో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. శాస్త్ర సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా నెలకొన్న 200,000 ఎఆర్‌టి (అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ) ఆసుపత్రులే అందుకు నిదర్శనం.
సరొగేట్‌ మదర్‌ అంటే..
పురుషుడి వీర్యాన్ని, స్త్రీ అండాన్ని నాళికలో ఫలదీకరిస్తారు. ఆ పిండాన్ని ఆరోగ్యవంతమైన గర్భసంచి వున్న మహిళలో ప్రవేశపెడతారు. ఆమె నవమాసాలు మోసి ఆ బిడ్డను కంటుంది. ఇలా వేరొకరి బిడ్డను తన గర్భంలో మోసి కనే మహిళను సరొగేట్‌ మదర్‌ అంటారు. మనం ఇల్లు అద్దెకిచ్చినట్టు ఈమె తన గర్భాన్ని అద్దెకిస్తుందన్నమాట. 
తెలుగునేలపై అద్దె తల్లులు
'అబ్బే! గర్భాన్ని అద్దెకివ్వడమేంటి అసహ్యంగా' అనుకున్న మన రాష్ట్రంలోనూ ఇవాళ ఆ పని నిరాటంకంగా సాగిపోతోంది. ఒక్క రాజధాని నగరంలోనే నెలకు ఎనిమిది నుంచి పది మంది అద్దె తల్లులు బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఖండాలనుదాటి తండాలకూ పాకుతోందీ అద్దె మహమ్మారి. కాకపోతే ఇక్కడ దళారులదే రాజ్యం. నిస్సంతుల నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేసి అమాయక గిరిజన మహిళల చేతిలో యాభై వేలు పెట్టి మిగతా పైకాన్ని కొట్టేస్తున్నారు. తాగుబోతు భర్తలకు మందు పోయించి మత్తులో ముంచేసి అప్పులిచ్చి రెండేసి సార్లు వారి మహిళల గర్భాన్ని అద్దెకివ్వడానికి ఒప్పిస్తున్నారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో మాదిరిగా వీరుకూడా తొమ్మిది నెలలపాటు అయినవారికి దూరంగా మరొకరి బిడ్డలను మోస్తుంటారు భారంగా.
ఎవరికోసం?
సంతానం లేని వారి కోసం ఈ 'సరొగసీ' వచ్చింది. అందుకు కారణాలు అనేకం.
గర్భాశయం పిల్లలు పుట్టడానికి అనువుగా లేకపోవడం.
ఎక్కువగా అబార్షన్లు కావడం.
గర్భ సంచి చిన్నగా వుండడం.
గర్భ సంచికి ఇన్‌ఫెక్షన్లు రావడం.
అనేకసార్లు ఐవిఎఫ్‌ ప్రయత్నాలు విఫలమైనవారు, గుండెజబ్బులు, మూత్రపిండ, కాలేయ మార్పిడి జరిగినవారు...
పలు కారణాలవల్ల గర్భసంచి తొలగించబడిన వారు పిల్లలను కనలేరు. వీరికి ఐవిఎఫ్‌ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌) ద్వారా సంతాన భాగ్యం కలిగిస్తున్నారు వైద్యులు. 
తారల 'అద్దె' బాట
'సొంత రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే కావాలి. పరాయి రక్తం వద్దు' అనుకుంటే మాత్రం 'టు లెట్‌' బోర్డులను వెతుక్కోవాల్సిందే. విదేశీయులేకాదు. సెలబ్రిటీలూ అదే రూటు పడుతున్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు, సెలబ్రిటీలకు అద్దె తల్లులు పరిచితులే. ఆ మధ్య వచ్చిన 'చోరీ చోరీ చుప్కే చుప్కే, ఫిల్హాల్‌' చిత్రాలలో వారు కనిపిస్తారు. అందాకా ఎందుకు! ఇటీవలే బాలీవుడ్‌ జంట ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావ్‌లు అద్దె తల్లి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చారన్న విషయం తెలిసిందే. కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కిరణ్‌రావ్‌ కృత్రిమ సంతాన సాఫల్య పద్ధతులను అనుసరించాల్సి వచ్చింది. హాలీవుడ్‌ స్టార్లకు అద్దె తల్లులు కొత్త కాకపోయినా బాలీవుడ్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పి ఆనందాన్ని నలుగురితో పంచుకున్న వ్యక్తి ఆమిర్‌. దీనివల్ల ఇటువంటి శాస్త్రీయ విధానాలకు సామాజికంగానూ ఆమోదం లభించే అవకాశాలున్నాయని పలువురు హీరోగారిని ప్రశంసిస్తున్నారుకూడా. హాలీవుడ్‌ తారలు నికోల్‌ కిడ్‌మాన్‌-కెయిత్‌ అర్బన్‌, సారా జెస్సికా పార్కర్‌- మాథ్యూ బ్రాడెరిక్‌, డెన్నిస్‌ క్వైడ్‌-కింబర్లే... అద్దె తల్లుల ద్వారా బిడ్డలను కన్నారు. పాప్‌ గాయకుడు రికీ మ్టాన్‌ సింగిల్‌ పేరెంట్‌గా అద్దె గర్భం ద్వారానే కవలలను పొందాడు. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు ఎల్టన్‌ జారు, ఆయన భాగస్వామి డేవిట్‌ ఫర్నిష్‌ లు 'గే' జంటగా ఈ పద్ధతిలోనే బాబును కన్నారు.
మనసు మాట వింటుందా!
ఆర్థిక పరిస్థితులు గర్భాన్ని అద్దెకివ్వడానికి ప్రోత్సహించినా నవమాసాలు మోసి కన్న బిడ్డ మీద ఎలాంటి బంధం వుండకూడదంటే సాధ్యమేనా! కన్న మరుక్షణం పరాయివారికి అందించడం ఆ తల్లి వల్లవుతుందా? బిడ్డ కదలికలను ప్రతిక్షణం అనుభూతించిన ఓ సాధారణ తల్లి అకస్మాత్తుగా తనను వదిలిపెట్టగలదా? మనసు ఆమె మాట వింటుందా? ఒకవేళ సర్దిచెప్పుకున్నా అప్పటివరకు శరీరభాగంగా వున్న బిడ్డకోసం మనసు ఆరాటపడకుంటుందా? కన్నబిడ్డకు పాలివ్వకుండా వుండగలదా? మరెప్పుడైనా ఆ బిడ్డను చూడాలనిపిస్తే ...? చుట్టుపక్కలవారు, చుట్టాలు దీన్ని ఎలా తీసుకుంటారు? అసలు శారీరక సంబంధం లేకుండా బిడ్డను కనడమేంటి... కాకమ్మ కథలు కాకపోతే? వంటి అనుమానపు ముళ్లు గుచ్చుకుండా వుంటారా? వాటిని తట్టుకోలేకే ఆ తొమ్మిది నెలలపాటు వనవాసం చేయాలనుకుంటారా? ఒకవేళ అలా వున్నా తర్వాత బిడ్డేమైందంటే ఏం చెప్తారు? ఇప్పుడంటే వయసులో వున్నారు కాబట్టి బిడ్డను మోసి కని ఇచ్చేస్తారు. పదే పదే గర్భాన్ని అద్దెకిచ్చి ఆరోగ్య సమస్యలు తలెత్తితే బాధ్యత ఎవరిది? వంటి వేలాది ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. పేదరికం, మరో మార్గం లేనితనం కూడా అన్నిటినీ మౌనంగా భరించే శక్తినిస్తుందేమో!
ఏమైనప్పటికీ తల్లి గర్భాన్ని సైతం సరకుగా భావించి బిడ్డల్ని తీసుకెళ్లే ధోరణి పెరుగుతూనే వుంది. పేదరికంలో మగ్గేవారికి ఆ తర్వాత పౌష్టికాహారం లభించడమూ కష్టమే. ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆలకించే నాథుడే వుండడు. వైద్యం చేయించే దిక్కే వుండదు. అందుకే ప్రభుత్వమే చట్టం చేసి స్పష్టమైన నియమనిబంధనలు ఏర్పాటుచేసి అద్దె తల్లులకు ఆలంబనగా నిలవాలి మరి.
ఎవరు అర్హులు?
తమ గర్భాన్ని అద్దెకివ్వాలంటే అంటే సరొగేట్‌ మదర్‌ కాబోయేవారికి సంబంధించి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ కొన్ని నిబంధనలు విధించింది. వారికి...
పెళ్లయి పిల్లలుండాలి.
ఎటువంటి ఆరోగ్య సమస్యలు మరీ ముఖ్యంగా... హెపటైటిస్‌, హెచ్‌ఐవి వంటి వ్యాధులు వుండకూడదు.
45 సంవత్సరాలలోపు వుండాలి.
గర్భం ధరించడానికి పూర్తిగా అర్హతగలిగినవారుగా ఆసుపత్రి వారు నిర్థారించాలి.
పైగా తమ సొంత పిల్లలతో సహా ఐదు సార్లు మాత్రమే గర్భం ధరించాలి. అంతకు మించితే గర్భాన్ని అద్దెకివ్వడానికి అనర్హులు. 
-----------------------------------------------------------------------------------------